Game Changer: 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కోసం అభిమాని సూసైడ్ లెటర్.. అప్‌డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు!
- రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్'
- జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- మూవీ విడుదల దగ్గర పడుతున్నా ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంపట్ల అభిమాని నిరాశ
- న్యూ ఇయర్ కానుకగా ట్రైలర్ విడుదల చేయాలని విజ్ఞప్తి
- లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని లేఖ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇటీవలే అమెరికాలోని డల్లాస్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
అలాగే మూవీ నుంచి మూడు పాటలతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటివరకు సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయకపోవడంపై ఓ అభిమాని నిరాశ వ్యక్తం చేశాడు. ఏకంగా సూసైడ్ లెటర్ రాసి మరీ మేకర్స్‌కి షాకిచ్చాడు. మూవీ ట్రైలర్ విడుదలపై వెంటనే అప్‌డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖ ద్వారా బెదిరించాడు. దీంతో ప్రస్తుతం చెర్రీ ఫ్యాన్ సూసైడ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆ లెటర్‌లో ఏముందంటే..
గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ గారికి నేను.. అనగా ఈశ్వర్, చరణ్ అన్న ఫ్యాన్. చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమా విడుదలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఏ విధమైన ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వడం లేదు. కనీసం అభిమానుల భావోద్వేగాలను పట్టించుకోవడం లేదు. ఈ నెల ఆఖరు కల్లా ట్రైలర్‌పై అప్‌డేట్ ఇవ్వకపోతే, కొత్త సంవత్సరం కానుకగా ట్రైలర్ విడుదల చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడుతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ విధేయుడు, చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్ అని లేఖలో రాసుకొచ్చాడు. ఇప్పుడీ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.