Mukesh Khanna: 'పుష్ప-2'ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయికీ న్యాయం జరిగింది: ముఖేశ్ ఖన్నా
- బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'పుష్ప-2: ది రూల్'
- విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్ల మార్క్
- తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించి మెచ్చుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా
- ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని కితాబు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప-2: ది రూల్' మొదటి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఏకంగా రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకుని, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు 'పుష్ప-2'పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా సినిమా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని, పెట్టిన ప్రతి రూపాయికీ న్యాయం జరిగిందన్నారు. ఈ మేరకు ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
"సరైన ప్రణాళిక, విజన్‌తో ఈ మూవీ తెరకెక్కింది. పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తోంది. లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను నమ్మకం పెట్టి తీస్తే ప్రేక్షకుల దానిలో లాజిక్స్ వెతకరు అనడానికి ఈ చిత్రమే నిదర్శనం. నేను అల్లు అర్జున్ నటించిన గత చిత్రాలను పెద్దగా చూడలేదు. కానీ, ఈ సినిమా చూసిన తర్వాత ఆయన గత చిత్రాలు చూడాలనే ఆలోచన వచ్చింది. అతని అద్భుత ప్రదర్శన చూసిన తర్వాత శక్తిమాన్ పాత్రకు బన్నీ అయితేనే సరైన న్యాయం చేయగలరు అని అనిపిస్తుంది.
ఇక దక్షిణాది చిత్రాల నుంచి బాలీవుడ్‌కు చెందిన దర్శక, నిర్మాతలు చాలా నేర్చుకోవాల్సి ఉంది. పుష్ప-2లో భార్యాభర్తల సన్నివేశాలను చాలా బాగా చూపించారు. ఎక్కడా అభ్యంతరకరంగా అనిపించలేదు. అదే బాలీవుడ్‌లో దంపతుల మధ్య సీన్స్‌ను ఎక్కువ మోతాదులో అశ్లీలతను జోడించి చూపిస్తారు. అలాంటి వాటి వల్ల డబ్బులు వస్తాయి. కానీ, అది ఎంతవరకు సరైనది" అని ముఖేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.