Mohan Babu: మీడియా ప్రతినిధిపై దాడి ఘటన.. మోహన్ బాబుపై కేసు నమోదు!
- మోహన్ బాబుపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు
- ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు
- ఈరోజు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం
- నిన్న రాత్రి తీవ్ర ఘర్షణ తర్వాత ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు
మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఈరోజు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
అయితే, మంగళవారం రాత్రి తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. రాత్రి తోపులాటలో ఆయన తలకు గాయమైనట్టు సమాచారం. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబుకి ట్రీట్‌మెంట్ జరుగుతోందని, ఇంకా వైద్యపరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన పీఆర్ టీమ్ చెబుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.