ఘనంగా జరిగిన దేవర సక్సెస్ సెలబ్రేషన్స్
- హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ వేడుక
- హాజరైన టాలీవుడ్ ప్రముఖులు
- సక్సెస్ జోష్‌లో కనిపించిన ఎన్టీఆర్
ఇదిలా వుండగా ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు అమెరికాకు వెళ్లిన హీరో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా గురువారం రోజు ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుక గుంటూరులో అభిమానుల మధ్య జరగాలి. అయితే అనుకోని కారణాల వల్ల కుదరలేదు. దేవి నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సక్సెస్‌మీట్‌కు పోలీసుల అనుమతి లభించలేదు.
ఈ విషయమై దేవర పంపిణీదారుడు, నిర్మాత నాగవంశీ అభిమానులను క్షమాపణలు కూడా కోరిన సంగతి తెలిసిందే. కాగా దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గురువారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగాయి. అభిమానులకు, మీడియాకు దూరంగా జరిగిన ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో పాటు నిర్మాతలు దిల్‌రాజు, నందమూరి కళ్యాణ్‌రామ్, దానయ్య, నాగవంశీ, దేవర పంపిణీదారులు తదితరులు పాల్గొన్నారు.