విరాట్ కోహ్లీ ఫామ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనూహ్య వ్యాఖ్యలు
- కోహ్లీపై నమ్మకం ఉంచాలన్న మాజీ దిగ్గజం
- నాకౌట్ దశ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉందన్న గవాస్కర్
- చాలా ఏళ్లుగా కోహ్లీ ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడని సమర్థించిన మాజీ క్రికెటర్
దేశం తరపున ఆడుతున్నప్పుడు ఏ ఆటగాడైనా మ్యాచ్‌లు గెలిపించాలని కోరుకుంటాడని కోహ్లీని ఉద్దేశించి గవాస్కర్ అన్నారు. కోహ్లీ చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడని, ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడని గవాస్కర్ ప్రస్తావించారు. విరాట్ ఫామ్ విషయంలో కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టోర్నీ ఆరంభ దశలోనే ఉన్నామని, ఇంకా సూపర్-8, సెమీ-ఫైనల్, బహుశా ఫైనల్ కూడా ఆడతారని ఆశిద్దామని గవాస్కర్ అన్నారు. అందుకే కోహ్లీ విషయంలో సహనం, నమ్మకం ఉండాలని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
టీ20 వరల్డ్ కప్ తదుపరి రౌండ్‌లో టీమిండియా ప్రవేశించిన నేపథ్యంలో కోహ్లీ తన మ్యాజికల్ ఫామ్‌ను తిరిగి పొందేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు చేసినంత మాత్రాన విఫలమైనట్టుగా భావించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మంచి బంతులు ఎదురవుతాయి. కాబట్టి కోహ్లీ త్వరగా ఫామ్‌లోకి వస్తాడని మనం ఆశించాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.