రెండు సీక్వెల్స్ ను పట్టాలెక్కిస్తున్న కార్తి!
- 2017లో వచ్చిన 'ఖాకి' పెద్ద హిట్
- 2019లో విజయాన్ని సాధించిన 'ఖైదీ'
- సీక్వెల్స్ దిశగా జరుగుతున్న సన్నాహాలు
- వచ్చే ఏడాదిలో పట్టాలెక్కుతున్న ప్రాజెక్టులు
కార్తి హీరోగా 2017లో 'ఖాకి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి, వినోత్ దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా కార్తి నటించిన ఈ సినిమా, సంచలన విజయాన్ని నమోదు చేసింది. నేరస్థులను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత రిస్క్ చేశాడనే ఈ కథ అనేక మలుపులు తిరుగుతుంది.
ఇక ఆ తరువాత కార్తి చేసిన 'ఖైదీ' కూడా భారీ విజయాన్ని సాధించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించే పనిలో కార్తి ఉన్నాడు. 'జపాన్' సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్న ఆయన, సాధ్యమైనంత త్వరగా హిట్ ను తన ఖాతలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు.