తండ్రి అమ్మేసిన భూమిలో వాటా కోసం కోర్టుకెక్కిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
- మంచిరేవులలో శోభానాగిరెడ్డి పేరిట వెయ్యి గజాల స్థలం
- శోభానాగిరెడ్డి చనిపోయాక ఆ భూమిని విక్రయించిన నాగిరెడ్డి
- నాడు మైనర్‌గా ఉన్న జగత్‌తో వేలి ముద్ర వేయించిన వైనం
- నేడు మేజర్ అయిన తనకు అందులో వాటా ఇప్పించాలంటున్న జగత్
- కొనుగోలుదారులతో పాటు తన ఇద్దరు అక్కలను ప్రతివాదులుగా చేర్చిన వైనం
ఈ భూమి వివరాల్లోకెళితే... భూమా శోభా నాగిరెడ్డి బతికుండగా... భూమా ఫ్యామిలీ ఆమె పేరిటే ఈ భూమిని కొనుగోలు చేసింది. అయితే శోభానాగిరెడ్డి చనిపోయాక ఆమె భర్త నాగిరెడ్డి ఆ భూమిని 2016లో వేరే వాళ్లకు విక్రయించారు. ఈ సందర్భంగా అప్పటికే మేజర్లు అయిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు తాను సంతకం చేయగా, అప్పటికి ఇంకా మైనారిటీ తీరని తన కుమారుడితో వేలి ముద్ర వేయించారు. ఈ విక్రయం ముగిసిన కొన్నాళ్లకే నాగిరెడ్డి కూడా మరణించిన సంగతి తెలిసిందే. అయితే నాడు భూమిని కేవలం రూ.2 కోట్లకు విక్రయిస్తే... ఇప్పుడు దాని విలువ రూ.6 కోట్లకు చేరినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో తన తల్లి చనిపోయాక ఆ భూమిని విక్రయించారని, దీంతో ఆ విక్రయం చెల్లదంటూ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తన ఇద్దరు అక్కలతో కలిసి ఇదివరకే కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... ఆ పిటిషన్‌లో ఆయనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందట. అయితే ఇప్పుడు తాను మైనర్‌గా ఉన్నప్పుడు ఆ భూమిని విక్రయించారని, ఇప్పుడు తాను మేజర్ నని, ఈ నేపథ్యంలో తనకూ ఆ భూమిలో వాటా ఇప్పించాలని కోరుతూ తాజాగా ఆయన నేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.