సుశాంత్ సింగ్ ఆత్మహత్య అంశంపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
- సుశాంత్ ను హత్య చేశారు
- దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మాఫియా పని చేస్తోంది
- సుశాంత్ మృతదేహంపై ఎవరో కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయి
సుశాంత్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ముంబై మాఫియా పనిచేస్తోందని స్వామి అన్నారు. దీని కోసం ఓ నటిని బలి చేసేందుకు రంగం సిద్ధమైందని చెప్పారు. సుశాంత్ డెడ్ బాడీపై ఎవరో కొట్టినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఆయన మెడపై కూడా గుర్తులు ఉన్నాయని చెప్పారు.
సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను స్వామి కోరారు. సుశాంత్ మరణం తర్వాత ప్రధాని మోదీకి కూడా గతంలో స్వామి లేఖ రాశారు. సుశాంత్ మృతి వెనుక బాలీవుడ్ పెద్దల హస్తం ఉందని... హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ముంబై పోలీసులపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారని లేఖలో ఆయన తెలిపారు.
మరోవైపు బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుతో బీహార్ పోలీసులు సైతం విచారణను ప్రారంభించారు. ఒకే కేసుకు సంబంధించి ముంబై పోలీసులు, బీహార్ పోలీసులు విచారణ జరుపుతుండటంపై రియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును ముంబైకి బదిలీ చేయాలని కోర్టుకు ఆమె విన్నవించింది.