తండ్రి చితికి నిప్పు పెట్టకముందే జగన్ సీఎం పీఠంపై కన్నేశాడు.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకున్నాడు!: మంత్రి నారా లోకేశ్
- వైఎస్ జగన్ కొత్త డ్రామాలకు తెరలేపాడు
- ఫిన్ టెక్ సదస్సు సందర్భంగా అలజడికి కుట్ర
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఐటీ శాఖ మంత్రి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ప్రతిపక్ష నేత జగన్ ‘కోడి కత్తి డ్రామా’కు తెరలేపారని లోకేశ్ ఆరోపించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ కు కొత్త కాదన్నారు. ఈ దాడి వెనుక వైసీపీ నేతలే ఉన్నారనీ, అది బయటపడ్డా ప్రజలను మోసం చేసేందుకు ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
‘వైజాగ్ లో జరుగుతున్న ఫిన్ టెక్ సదస్సును భగ్నం చేయడం, అటు ప్రజల సానుభూతిని పొందడం - ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని జగన్ అనుకున్నాడు. ఏ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరుగుతున్నా అదే సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని చూస్తున్నారు. కానీ జగన్ నాటకానికి ఏ ప్రయోజనమూ దక్కలేదు’ అని జగన్నాటకం అన్న హ్యాగ్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.