తప్పనిసరై అప్పట్లో అలాంటి పాత్రల్లో చేశాను: నటి పవిత్రా లోకేశ్
- కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు
- ఇల్లు గడవడం కోసం నెగటివ్ రోల్స్ కూడా
- 'ప్రస్థానం' తరువాత వెనుదిరిగి చూడలేదన్న పవిత్రా లోకేశ్
తన ఇంటికి స్టార్ హీరో అంబరీశ్ వచ్చినప్పుడు, తనను సినిమాల్లోకి ఆహ్వానించారని, 16 సంవత్సరాల వయసులోనే పరిశ్రమకు వచ్చానని, తన తండ్రికి మంచి పేరు ఉండటంతో గ్రాండ్ వెల్ కమ్ ఉంటుందని భావించిన తనకు, అలా ఆలోచించుకోవడం తప్పని తెలిసేందుకు ఎక్కువ కాలమేమీ పట్టలేదని చెప్పింది.
అయిష్టంగా సినిమాల్లోకి ప్రవేశించిన తనకు అక్కడి పరిస్థితులు అవగతమయ్యాయని, ఎవరూ మాట సాయం కూడా చేయలేదని చెప్పింది. శ్రీదేవిలా స్టార్ హీరోయిన్ అవాలని భావించిన తనకు, సెకండ్ హీరోయిన్ చాన్సులే వచ్చాయని పవిత్రా లోకేశ్ వ్యాఖ్యానించింది. ఎత్తుగా ఉండటం, లావుగా ఉండటం తనకు మైనస్ అయిందని, బతకడం, ఇల్లు గడవటం కోసం కొన్ని నెగటివ్ రోల్స్ చేయాల్సి వచ్చిందని, అప్పనిసరై అప్పట్లో కొన్ని పాత్రలను ఇష్టం లేకుండా చేశానని చెప్పింది.
కన్నడలో తన సినిమాలను చూసిన భీమనేని శ్రీనివాసరావు, తెలుగులో 'దొంగోడు'లో చాన్స్ ఇచ్చారని, ఆ తరువాత 'ప్రస్థానం'తో వెనక్కు తిరిగి చూడలేదని చెప్పింది. 'రేసుగుర్రం', 'టెంపర్', 'జై లవకుశ', 'పండగ చేస్కో', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'ఎంసీఏ', 'అజ్ఞాతవాసి', 'సాక్ష్యం', 'హ్యాపీ వెడ్డింగ్' వంటి చిత్రాల్లో మంచి పాత్రలు వచ్చాయని, వయసుకు మించిన పాత్రలను చేస్తున్నందుకు తానేమీ బాధపడటం లేదని చెప్పింది.