ఆదిశేషుడు విషాన్ని వెదజల్లింది ఇక్కడే !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆదిశేషుడు విషాన్ని వెదజల్లింది ఇక్కడే !

ఆదిశేషుడు విషాన్ని వెదజల్లింది ఇక్కడే !
శ్రీమహావిష్ణువు శయన మూర్తిగా ఆనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. గర్భాలయం నిండుగా ఆదిశేషుడిపై పవళించే ఆయన రూపాన్ని చూసి పరవశించిపోని భక్తులంటూ ఉండరు. వైకుంఠంలోనే కాదు .. శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళితే అక్కడికి ఆయనను ఆదిశేషుడు అనుసరిస్తూనే ఉంటాడు. స్వామివారికి ఆసనమై ఆయనకి గొడుగులా తన పడగలను విప్పుతాడు. అలసిపోయిన స్వామివారు సేదదీరడానికి పట్టుపానుపులా మారిపోతాడు. అందుకే ఆదిశేషుడిని చూసిన భక్తులు ఆయన అదృష్టానికి అసూయపడుతుంటారు.

సాధారణంగా ఇలాంటి ఆలయాల్లో పాము కనిపిస్తే, ఆదిశేషుడి అవతారంగానే భావించి భక్తులు నమస్కరిస్తూ ఉంటారు. అలాంటిది శిలారూపంలో గల ఆదిశేషుడు ఒక్కసారిగా తన నిజరూపాన్ని పొంది దొంగాలపై విషం చిమ్మినట్టు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. మహిమాన్వితమైన ఈ సంఘటన 'తిరుమయం' క్షేత్రంలో జరిగినట్టుగా అక్కడి స్థలపురాణం చెబుతోంది. తమిళనాడు - పుదుక్కోట్టై సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ ఆవిర్భవించిన స్వామివారిని 'సత్యగిరినాథుడు' పేరుతో భక్తులు కొలుచుకుంటూ ఉంటారు.

స్వామివారి మహిమలను గురించి ఇక్కడి వాళ్లు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. వాటిలో ఒక సంఘటన ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది. ఒకసారి కొంతమంది దుండగులు స్వామి వారి విగ్రహాన్ని అపహరించడానికి పథకం రచించారు. అనుకున్న ప్రకారం ఒకనాటి రాత్రివేళ ఆలయంలోకి ప్రవేశించారు. దీపం వెలుగులో సేదతీరుతోన్న స్వామివారిని అక్కడి నుంచి తరలించడానికి రంగంలోకి దిగారు. ఆ దుండగులు స్వామివారి విగ్రహాన్ని తాకడమే ఆలస్యం అప్పటి వరకూ శిలారూపంలో కనిపించిన ఆదిశేషుడు ఒక్కసారిగా నిజరూపాన్ని సంతరించుకున్నాడట.

ఆ దృశ్యం చూసి భయంతో బిగుసుకుపోయిన దుండగులు తేరుకునేలోగానే, ఆదిశేషుడు వారిపై విషాన్ని చిమ్మాడు. ఆ విషజ్వాల ధాటికి తట్టుకోలేక బయటికి పరుగులు తీసిన దుండగులు, ఎక్కడి వాళ్లు అక్కడే కుప్పకూలిపోయారట. జరిగిన సంఘటన ఏమిటనేది మరునాడు ఉదయానికి స్థానికులు గ్రహించగలిగారు. ఈ క్షేత్రంలో స్వామివారు ... ఆదిశేషుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నారనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం స్వామివారి వైభవానికి అద్దంపడుతూ ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడి 'సత్యతీర్థం'లో స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తే, ఆయురారోగ్యాలు - అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles