శ్రీశైలం మల్లన్న పేరు వెనుక కథ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీశైలం మల్లన్న పేరు వెనుక కథ

శ్రీశైలం మల్లన్న పేరు వెనుక కథ
మానవులంతా పార్వతీపరమేశ్వరులను తల్లిదండ్రులుగా భావిస్తూ ... ఆరాధిస్తూ వుంటారు. ఆదిదంపతులుగా దేవతలతో సైతం పూజలందుకుంటోన్న ఉమాశంకరులు, శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికా మల్లికార్జునులుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. లోకకంటకుడైన అరుణుడు అనే రాక్షసుడిని అమ్మవారు తుమ్మెద (భ్రమరం) రూపంలో సంహరించి, మహర్షుల కోరిక మేరకు ఇక్కడ కొలువుదీరింది. ఈ కారణంగానే అమ్మవారు భ్రమరాంబికగా పూజాభిషేకాలు అందుకుటోంది.

ఇక మల్లికార్జునుడు అనే పేరు స్వామివారికి ఎలా వచ్చిందనే విషయంపై కూడా ఇక్కడ ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తుంటాయి. బ్రహ్మదేవుడు స్వామిని మల్లికా పుష్పాలతో పూజించడం వలన 'మల్లికార్జునుడు' అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక చంద్రావతి అనే భక్తురాలి కారణంగా స్వామికి ఈ పేరు వచ్చిందని కూడా అంటారు.

పూర్వం చంద్రగుప్తుడనే రాజు, కొన్ని సంవత్సరాలపాటు జైత్రయాత్రలు చేసి విజయంతో తన రాజ్యానికి తిరిగి వస్తాడు. యవ్వనవతి అయిన తన కూతురు చంద్రావతిని గుర్తించలేక, ఆమెను పరస్త్రీ గా భావించి వెంటపడతాడు. ఆయన బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చంద్రావతి శ్రీశైలానికి చేరుకుంటుంది. అక్కడే ఉంటూ ప్రతినిత్యం శివుడిని పూజించసాగింది.

పరమశివుడి కోసం ఆమె అనునిత్యం ఓ మల్లెపూల మాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అల్లి మనస్పూర్తిగా సమర్పించసాగింది. ఇందుకు నిదర్శనంగా శివయ్యకి చంద్రావతి మల్లెపూల మాలను సమర్పించే శిలా ప్రతిమ శ్రీశైలంలో దర్శనమిస్తూ వుంటుంది. చంద్రావతి భక్తికి మెచ్చిన శివుడు, ఇక నుంచి తాను మల్లికార్జునుడు పేరుతో ప్రసిద్ధి చెందుతానని మాట ఇచ్చాడట. అప్పటి నుంచి స్వామి ... మల్లయ్యగా ... మల్లన్నగా ... మల్లికార్జునుడు గా భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నాడు.

More Bhakti Articles