మహిళలపై నేరాల కేసులు.. దేశంలోనే ఏపీకి రెండో స్థానం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళలపై నేరాల కేసులు.. దేశంలోనే ఏపీకి రెండో స్థానం!

Crimes against women cases Andhra Pradesh ranks second in the country
  • దేశవ్యాప్తంగా 187 మంది ప్రజాప్రతినిధులపై కేసులు
  • జాబితాలో బీజేపీ టాప్, టీడీపీకి మూడో స్థానం
  • 14 మందిపై అత్యాచారం కేసులు.. ఐదుగురు కేంద్ర మంత్రులపై ఆరోపణలు
  • నేరచరిత ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించాలన్న ఏడీఆర్
చట్టసభల్లో మహిళల హక్కులు, రక్షణ గురించి మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలు, వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నారన్న చేదు నిజాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులను విశ్లేషించి శుక్రవారం విడుదల చేసిన ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 4,881 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించగా, మొత్తం 187 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వీరిలో 19 మంది ఎంపీలు, 168 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరిలో 14 మందిపై (12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు) నేరుగా అత్యాచారం (ఐపీసీ సెక్షన్ 376) కేసులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కలవరపరిచే గణాంకాలు
మహిళలపై నేరాల కేసులున్న ప్రజాప్రతినిధుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 22 మందితో (21 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ) దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వంలోని నలుగురు మంత్రులపై కూడా ఇలాంటి కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఒక వివాదస్పద ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు ఉందని, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఒక యువ ఎంపీతో పాటు రాజ్యాంగ పదవిలో ఉన్న సీనియర్ నేతపై కూడా అభియోగాలున్నట్లు తెలిపింది.

తెలంగాణలో మొత్తం ఐదుగురు ప్రజాప్రతినిధులపై (ముగ్గురు లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు) కేసులున్నాయి. వీరిలో ముగ్గురు బీజేపీ ఎంపీలు కాగా, తొలిసారి గెలిచిన ఒక సిట్టింగ్ ఎంపీపై అత్యాచారం కేసు నమోదై ఉండటం గమనార్హం.

పార్టీలు, రాష్ట్రాల వారీగా వివరాలు
పార్టీల వారీగా చూస్తే, బీజేపీకి చెందిన 106 మంది (95 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు) ఈ జాబితాలో ఉండి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 18 మంది (17 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ) ప్రజాప్రతినిధులు మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన 11 మంది ఎంపీలలో ఐదుగురు కేంద్ర మంత్రులు కాగా, వారిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రాల పరంగా పశ్చిమ బెంగాల్ (69) మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ (22) రెండో స్థానంలో, ఒడిశా (17) మూడో స్థానంలో నిలిచాయి.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడాన్ని ఏడీఆర్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించాలని, వారి కేసులను ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ద్వారా వేగంగా విచారించి శిక్షలు ఖరారు చేయాలని ఏడీఆర్ డిమాండ్ చేసింది.
Advertisement
Association for Democratic Reforms
Crimes against women
Andhra Pradesh politicians
ADR report 2024
BJP Congress TDP
Indian MP MLA criminal cases

More Telugu News