ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్రపతి పాలన డిమాండ్: పల్లా శ్రీనివాసరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్రపతి పాలన డిమాండ్: పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao says Presidents Rule demand is to divert public attention
  • వైసీపీనే క్షేత్రస్థాయిలో గొడవలు సృష్టిస్తోందని పల్లా ఆరోపణ
  • జగన్‌పై ఉన్న కేసులను గుర్తు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
  • స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైసీపీ చేస్తున్న డిమాండ్, ప్రజల దృష్టిని మళ్లించేందుకు పన్నిన రాజకీయ ఎత్తుగడ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తూ, మరోవైపు శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మండిపడ్డారు.

జగన్‌రెడ్డితో పాటు వైసీపీ నేతలపై ఉన్న క్రిమినల్ కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని పల్లా ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో జగన్‌రెడ్డి 16 నెలల పాటు జైలులో ఉన్న విషయాన్ని, వివేకా హత్య కేసులో సీబీఐ ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ‘గొడ్డలిపార్టీ’ వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. తమపై ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, రాష్ట్రపతి పాలన అంటూ కొత్త నాటకానికి తెరతీయడం రాజకీయ కపటత్వమని దుయ్యబట్టారు.

గత ఎన్నికల సమయంలో వైసీపీ వ్యవహరించిన తీరును ప్రజలు చూశారని, ఇప్పుడు కూడా అదే తరహాలో వివాదాలు సృష్టించి ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు, గత ఐదేళ్ల తమ పాలనలో వ్యవహరించిన తీరుపై వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్ వేసేలా, ప్రతి ఓటరు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మవద్దని, వాస్తవాలను గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Palla Srinivasa Rao
President's Rule Andhra Pradesh
YSRCP Jagan Mohan Reddy
TDP NDA Government
Andhra Pradesh Politics
Law and Order Issues

More Telugu News