తిరువూరులో సీడ్ యాక్సిస్ రోడ్ల తరహాలో అభివృద్ధికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- తిరువూరులో మధిర ప్రధాన రహదారి ఆధునికీకరణ పనులకు శ్రీకారం
- రూ. 14 కోట్ల పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన చంద్రబాబు
- ప్రత్యక్షంగా భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. తిరువూరు పట్టణంలోని మధిర ప్రధాన రహదారి ఆధునీకరణ, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ విధానంలో రూ.14 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. సచివాలయం నుంచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయగా, స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు మధిర రోడ్డు వద్ద ప్రత్యక్షంగా భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి ఐఎస్‌బీ రోడ్లు, రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్ల నమూనాలో తిరువూరు మధిర రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రూ.14 కోట్ల ప్రాజెక్టు పూర్తయితే తిరువూరు పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని... ప్రయాణికులు, స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా డప్పు కొట్టి, నృత్యం చేస్తూ కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏ. కుమార్, మున్సిపల్ కమిషనర్ కె. మనోజ్, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.