అమెరికాకు ఇరాన్‌ కీలక ఆఫర్‌.. దిగొచ్చిన చమురు ధరలు

అమెరికాకు ఇరాన్‌ కీలక ఆఫర్‌.. దిగొచ్చిన చమురు ధరలు

Iran key offer to America leads to drop in oil prices
  • హర్మూజ్‌ జలసంధి తెరవడానికి సిద్ధమన్న ఇరాన్‌
  • అమెరికా సైనిక ఒత్తిడి తగ్గించాలని షరతు
  • పోర్టుల దిగ్బంధనం ఎత్తివేయాలని డిమాండ్‌
  • మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ప్రతిపాదన
  • చమురు ధరలు 99 డాలర్ల దిగువకు పతనం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్‌ కీలక ప్రతిపాదన చేసింది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు సిద్ధమని తెలిపింది. ఈ విషయాన్ని ఓ సీనియర్‌ ఇరాన్‌ అధికారి వెల్లడించినట్లు రాయిటర్స్‌ తెలిపింది. మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు చేరవేసినట్లు సమాచారం.

అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నట్లు ఈ ప్రతిపాదనతో సంకేతాలు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్‌లో మధ్యవర్తి దేశాలతో ఈ అంశంపై చర్చించాలని టెహ్రాన్‌ భావిస్తోంది. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య భేటీ ఉండబోదని ఇరాన్‌ అధికారి తెలిపారు. అయితే అమెరికా నిబద్ధత చూపితే ఒప్పందం దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు.

హర్మూజ్‌ జలసంధికి సంబంధించిన సైనిక చర్యలను అమెరికా నిలిపివేయాలని ఇరాన్‌ కోరుతోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్‌ పోర్టులపై ఆంక్షలు ఎత్తివేస్తే జలసంధిని తిరిగి తెరిచి చర్చలను కొనసాగిస్తామని టెహ్రాన్‌ చెబుతోంది. పోర్టులపై ఆంక్షలు ఇరాన్‌ ముడిచమురు ఎగుమతులు, సముద్ర రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. చర్చలను పునరుద్ధరించేందుకు ఇరాన్‌ గతంలో ఏడు షరతులను కూడా వెల్లడించింది.

హర్మూజ్‌ జలసంధి త్వరలో తెరుచుకునే అవకాశం ఉందన్న వార్తలతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్‌ చమురు ధర 99 డాలర్ల దిగువకు పడిపోయింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర సెషన్‌ గరిష్ఠ స్థాయి నుంచి 3.5 శాతానికి పైగా తగ్గగా, వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 2.25 శాతం పడిపోయింది. హర్మూజ్‌ ద్వారా ముడిచమురు సరఫరాలో అంతరాయాలపై ఆందోళనలు తగ్గడంతో ధరలు దిగివచ్చాయి.
Advertisement
Iran
USA
Strait of Hormuz
Oil Prices
Crude Oil
Masoud Pezeshkian

More Telugu News