Advertisement

‘మన్‌ కీ బాత్‌’లో కడప రైతు.. వరదారెడ్డికి ప్రధాని మోదీ కితాబు

PM Modi praises Kadapa farmer Varada Reddy in Mann Ki Baat
  • ‘మన్‌ కీ బాత్‌’లో కడప రైతు వరదారెడ్డికి ప్రధాని మోదీ ప్రశంస
  • సంప్రదాయ పంటలకు బదులుగా అవకాడో సాగుతో సక్సెస్
  • నూతన ఆలోచనలకు వరదారెడ్డి ఉదాహరణ అని కొనియాడిన ప్రధాని
  • ప్రధాని ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేసిన రైతు
  • గ్రామ ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్న వరదారెడ్డి
కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన లింగాల మండలం వెలిదండ్ల గ్రామ రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధాని మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో అభినందించారు. ఈయన స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని దేశ ప్రజలకు పరిచయం చేశారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఏళ్ల తరబడి టమాటా, అరటి వంటి పంటలు సాగు చేసిన వరదారెడ్డి, ఓసారి తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్‌ ద్వారా సాగు వివరాలు తెలుసుకుని, విజయవంతంగా 4 టన్నుల దిగుబడి సాధించారు. స్థానిక మార్కెట్లకే నేరుగా సరఫరా చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. మన రైతుల నూతన ఆలోచనలు వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మారుస్తున్నాయో చెప్పడానికి వరదారెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ" అని కొనియాడారు.

ఈ సందర్భంగా రైతు వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. "గతంలో సాగు చేసిన పంటలతో చాలా నష్టపోయాను. అందుకే అవకాడో సాగుకు మొగ్గుచూపాను. ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, వాటికి వచ్చే తెగుళ్లు, వాడాల్సిన ఎరువులపై అవగాహన పెంచుకుని సాగు మొదలుపెట్టాను. నాలుగేళ్లకు ఒకటిన్నర టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.100 చొప్పున చుట్టుపక్కల ప్రాంతాల్లోనే విక్రయించాను. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ నన్ను అభినందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని గ్రామ ప్రజలతో పంచుకున్నాను" అని ఆయన తెలిపారు.
Advertisement
Karna Varada Reddy
PM Narendra Modi
Mann Ki Baat
Kadapa Avocado Farmer
Andhra Pradesh Agriculture
Innovative Farming India

More Telugu News