వాణిజ్య పన్నులశాఖలో అవినీతి.. ఇద్దరు అధికారులు సహా ముగ్గురు డిస్మిస్

AP Commercial Taxes Department corruption three including two officers dismissed
  • వాణిజ్య పన్నులశాఖలో ఇద్దరు అధికారులు, ఒక సీనియర్ అసిస్టెంట్ డిస్మిస్
  • అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్న ప్రభుత్వం
  • విచారణలో మొత్తం 8 అభియోగాలు రుజువైనట్లు నిర్ధారణ
  • హైకోర్టు ఆదేశాల అనంతరం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరు అధికారులు సహా ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం విధుల్లోంచి తొలగించింది. డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె. సంధ్య, జీఎస్టీ అధికారి బి. మెహర్‌కుమార్, అప్పటి సీనియర్ అసిస్టెంట్ కె.వి. చలపతిని డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు విజయవాడ మొదటి డివిజన్ జాయింట్ కమిషనర్ కార్యాలయంలోని ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసేవారు.

వీరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం గతంలో విచారణకు ఆదేశించింది. రాష్ట్ర పన్నుల శాఖ అదనపు కమిషనర్ బి. శేఖర్‌ను విచారణాధికారిగా నియమించగా, వీరిపై నమోదైన ఎనిమిది అభియోగాలు రుజువైనట్లు ఆయన తన నివేదికలో నిర్ధారించారు. ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ ఈ ముగ్గురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై 2023లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం, ఈ ఏడాది మార్చిలో తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తన నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సమర్పించిన వివరణలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ నిన్న‌ వీరిని సర్వీసు నుంచి తొలగిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.                                
Advertisement
AP Commercial Taxes Department
Corruption charges
Vijayawada Intelligence Division
GST Officer Meher Kumar
Deputy Assistant Commissioner Sandhya
Government employees dismissal

More Telugu News