ఘనంగా జనని-సూర్యతేజ వివాహం.. సతీసమేతంగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆనందంతో ఏడ్చేసిన బండ్ల గణేశ్

Bandla Ganesh daughter Janani wedding AP CM Chandrababu Naidu attends with wife
  • హైదరాబాదులో ఘనంగా జరిగిన బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం
  • పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఏడడుగులు
  • హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
  • హైదరాబాద్ వేదికగా జరిగిన వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె జనని వివాహం ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆమె ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన అగ్ర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులు జనని, సూర్య తేజ వద్దకు వెళ్లి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ, బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తన కుమార్తె పెళ్లి వేడుకకు చంద్రబాబు సతీసమేతంగా రావడం పట్ల బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో ఏడ్చేశారు. దాంతో పక్కనే ఉన్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఆయనను ఊరడించారు. కాగా, వరుడు సూర్యతేజ సీఎం చంద్రబాబు-నారా భువనేశ్వరిల చేతులమీదుగా తాళి అందుకుని వధువు మెడలో మంగళసూత్రధారణ చేయడం విశేషం. 

బండ్ల గణేశ్ కు సినీ, రాజకీయ రంగాల్లో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో, ఈ వివాహ వేడుకకు ఇరు రంగాలకు చెందిన నాయకులు, నటీనటులు, నిర్మాతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారి రాకతో వివాహ ప్రాంగణం సందడిగా మారింది. అతిథులను బండ్ల గణేశ్ దంపతులు సాదరంగా ఆహ్వానించి, వారి బాగోగులు చూసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Bandla Ganesh
Janani Surya Teja Wedding
Chandrababu Naidu
Nara Bhuvaneshwari
Hyderabad JRC Convention
Bandla Ganesh Daughter Marriage

More Telugu News