50 శాతం పడిపోయిన ఎల్‌ఐసీ షేరు విలువ.. అసలు విషయం ఇదీ!
- ఎల్‌ఐసీ తొలిసారి బోనస్ షేర్ల జారీ
- 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన
- ధర సగానికి తగ్గినట్లు కనిపించిన షేరు
- మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మార్పు లేదు
- రికార్డు తేదీ నాటికే అర్హత నిర్ధారణ
ఏంటీ బోనస్ లెక్క?
ఎల్‌ఐసీ తన ఇన్వెస్టర్లకు ఒక షేరుకు బదులుగా మరొక షేరును ఉచితంగా బోనస్‌గా ఇవ్వాలని గత ఏప్రిల్‌లోనే నిర్ణయించింది. ఇందుకోసం మే 29ని రికార్డు తేదీగా నిర్ణయించింది. బోనస్ షేర్ల జారీ వల్ల మార్కెట్లో కంపెనీ మొత్తం షేర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. కానీ కంపెనీ మార్కెట్ విలువలో ఎలాంటి మార్పు ఉండదు. దీనివల్ల షేరు ధర సగానికి తగ్గుతుంది. ఫలితంగా సామాన్య ఇన్వెస్టర్లకు కూడా ఈ షేరు అందుబాటులోకి వచ్చి మార్కెట్లో దీని కొనుగోళ్లు, అమ్మకాలు పెరుగుతాయి.
ఎవరు అర్హులు?
మే 29 నాటికి ఎవరి డీమ్యాట్ ఖాతాలో అయితే ఎల్‌ఐసీ షేర్లు ఉంటాయో వారే ఈ బోనస్ షేర్లు పొందడానికి అర్హులు. సెబీ నిబంధనల ప్రకారం.. రికార్డు తేదీ కంటే ఒక రోజు ముందే షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే గురువారం బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో, బుధవారమే ఎల్‌ఐసీ షేర్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ బోనస్ స్టాక్స్ దక్కుతాయి. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎల్‌ఐసీ తన 21 లక్షల మందికిపైగా ఉన్న ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు ఇవ్వడం ఇదే తొలిసారి.