గ్యాస్ సిలిండర్ ధర రూ. 29 పెంపు.. మూడు నెలల్లో రెండోసారి వాత!

LPG Cylinder price hiked by 29 rupees for the second time in three months
  • పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి
  • తాజా పెంపుతో ఢిల్లీలో రూ. 942కు చేరిన ధర
  • అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే కారణం
  • మార్చిలో సిలిండర్‌పై రూ. 60 పెంపు
దేశంలోని మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి ధరల భారం పడింది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ (LPG) వంటగ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (IOC, HPCL, BPCL) రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు ఆదివారం (జూన్ 7) నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కి పెరిగింది. గత మూడు నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశానికి గ్యాస్ సరఫరా అయ్యే కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మార్గంలో ఏర్పడిన అంతరాయాలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. ఈ సవరణకు ముందు వరకు చమురు సంస్థలు దేశీయ ఎల్పీజీ విక్రయాలపై సిలిండర్‌కు సుమారు రూ. 703 వరకు నష్టాన్ని భరిస్తూ వచ్చాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ తాజా పెంపు తర్వాత కూడా అంతర్జాతీయ కొనుగోలు ధరకు, దేశీయ విక్రయ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా భర్తీ కాలేదని తెలుస్తోంది. గత మార్చి నెలలో కూడా సిలిండర్ ధరను రూ. 60 పెంచిన సంగతి తెలిసిందే.

మండిపోతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ
వంటగ్యాస్ మాత్రమే కాకుండా, కొన్ని వారాలుగా ఇతర ఇంధన ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. మే మధ్య వారం నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.50 వరకు పెరగ్గా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు కిలోకు రూ. 6 వరకు పెరిగాయి. ఇంత పెరిగినప్పటికీ, ఆయిల్ కంపెనీలు ఇంకా పెట్రోల్‌పై లీటరుకు రూ. 11, డీజిల్‌పై రూ. 33.6 చొప్పున నష్టాన్ని భరిస్తున్నట్టు సమాచారం.

ఈ వరుస ధరల పెంపు దేశంలోని కోట్ల మంది గృహిణుల నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి రాయితీ (Subsidy) జమ అవుతున్నప్పటికీ, రాయితీ లేని సాధారణ వినియోగదారులు మాత్రం ఈ భారాన్ని పూర్తిగా మోయక తప్పడం లేదు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతూనే ఉన్నాయి.
Go Back to Shorts
LPG Cylinder
Gas Price Hike
Cooking Gas Price
IOC HPCL BPCL
Delhi Gas Price
Petrol Diesel Price
CNG Price Increase
PM Ujjwala Yojana
International Crude Oil
Fuel Price India

More Telugu News