కిడ్నీ వ్యాధికి హైబీపీ ముందస్తు హెచ్చరికా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!
- కిడ్నీలు దెబ్బతింటే రెనిన్ హార్మోన్ విడుదల
- ఇది రక్తంలో ఉప్పు, నీరు పేరుకుపోయేలా చేస్తుంది
- ఫలితంగా రక్తనాళాలు కుచించుకుపోతాయి
- దీంతో బీపీ పెరుగుతుంది
- ఈ లక్షణాలు ఉంటే అలర్ట్ అవ్వాల్సిందే
కిడ్నీలు కేవలం వ్యర్థాలను బయటకు పంపడమే కాదు.. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతూ బీపీని నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తాయి. అయితే డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు లేదా వంశపారంపర్య సమస్యల వల్ల కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు వాటికి రక్తప్రసరణ తగ్గుతుంది. అలాంటప్పుడు కిడ్నీలు ‘రెనిన్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలో ఉప్పు, నీరు పేరుకుపోతుంది. దీంతో బీపీ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిలో అకస్మాత్తుగా బీపీ పెరిగితే అది కిడ్నీ సమస్యే అని అర్థం చేసుకోవాలి. మందులు వాడుతున్నా బీపీ అదుపులోకి రాకపోవడాన్ని ‘రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్’ అంటారు. ఇది కూడా కిడ్నీ వ్యాధికి సూచన.
కిడ్నీ వ్యాధిని ‘సైలెంట్ కండిషన్’ అంటారు. ఎందుకంటే ఆరంభంలో ఎలాంటి లక్షణాలు ఉండవు. వ్యాధి ముదిరే కొద్దీ కాళ్లలో వాపులు, తీవ్రమైన అలసట, శ్వాస ఆడకపోవడం, తరచూ తలనొప్పి, నిద్రలేమి, ఆకలి తగ్గడం, మూత్రంలో నురగ రావడం లేదా రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో కిడ్నీ పనితీరు పరీక్షలు (కేఎఫ్‌టీ), సీరమ్ క్రియాటినిన్ రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కిడ్నీ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉప్పు వాడకం తగ్గించడం, తగినంత నీరు తాగడం, బరువు అదుపులో ఉంచుకోవడం, వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి. అలాగే డాక్టర్ల సలహా లేకుండా సొంతంగా మందులు వాడొద్దు.