బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న తట్టు... 250 మందికి పైగా చిన్నారుల బలి.. భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
- భారత్, మయన్మార్‌లకు వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
- వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడమే బంగ్లాలో మహమ్మారికి ప్రధాన కారణం
- భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజ్ అధికంగా ఉన్నందున ముప్పు తక్కువేనన్న నిపుణులు
- అప్రమత్తంగా ఉండటం మాత్రం తప్పనిసరి అని నిపుణుల సూచన
బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గాను 58 జిల్లాల్లో తట్టు కేసులు తీవ్రంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. గత రెండేళ్లుగా, ముఖ్యంగా 2025లో ఆ దేశంలో ఇమ్యునైజేషన్ కార్యక్రమం మందగించడమే ఈ ప్రాణాంతక విజృంభణకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం నమోదైన కేసుల్లో 91 శాతం ఒకటి నుంచి 14 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అత్యవసర వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించినప్పటికీ, వ్యాధి వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో సరిహద్దు దేశాల్లో ఆందోళన నెలకొంది.
భారత్‌కు ప్రమాదం ఉందా?
భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించే జషోర్, చపైనవాబ్‌గంజ్ వంటి సరిహద్దు రద్దీ ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో ఉండటం, ఢాకా, చట్టోగ్రామ్ వంటి నగరాల నుంచి అంతర్జాతీయ రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో పేర్కొంది.
అయితే, బంగ్లాదేశ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ, భారత్‌లో జాతీయ స్థాయిలో మహమ్మారిగా మారే అవకాశాలు చాలా తక్కువని సీనియర్ వైరాలజిస్ట్, ఇండియా ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ మీజిల్స్-రుబెల్లా (IEG-MR) కో-ఛైర్ డాక్టర్ జాకబ్ జాన్ స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం భారత్‌లో అమలవుతున్న పటిష్ఠమైన వ్యాక్సినేషన్ కార్యక్రమమే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25లో మీజిల్స్-రుబెల్లా మొదటి డోస్ కవరేజ్ 93.7 శాతం ఉండగా, రెండో డోస్ 92.2 శాతంగా ఉంది.
తట్టు అంటే ఏమిటి? ఎందుకంత ప్రమాదకరం?
తట్టు గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ వ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకుతుంది. వ్యాధి సోకిన 10 నుంచి 14 రోజుల్లో అధిక జ్వరం, జలుబు, కళ్లు ఎర్రబడటం, దగ్గు, నోటిలో తెల్లటి మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ముఖంపై మొదలై శరీరం అంతటా దద్దుర్లు వ్యాపిస్తాయి. దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. న్యుమోనియా, డయేరియా, మెదడువాపు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసి ప్రాణాంతకం కావచ్చు. వ్యాక్సినేషన్ మాత్రమే దీనికి రక్షణ కవచం.
భారత్‌లో 2022లో ముంబైతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతరాయం కలగడంతో తట్టు కేసులు పెరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం అప్రమత్తమై వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను ముమ్మరం చేసింది. 2026 చివరి నాటికి తట్టు, రుబెల్లా నిర్మూలనను భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
మొత్తం మీద భారత్‌లో అధిక వ్యాక్సినేషన్ కవరేజ్ రక్షణ కవచంలా ఉన్నప్పటికీ, పొరుగు దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసి, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు సూచిస్తున్నాయి.