అమ్మను, అమరావతిని ఇష్టపడని వారిని పట్టించుకోం.. జగన్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: ఏపీ మంత్రి సంధ్యారాణి
- రాజకీయం చేసే ముందు జగన్ తన ఇంటిని చక్కబెట్టుకోవాలన్న మంత్రి సంధ్యారాణి
- ఉత్తరాంధ్రను వైసీపీ సర్వనాశనం చేసిందని, తాము అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ
- కూటమి కృషితోనే గూగుల్, అర్సెల్లార్ మిట్టల్ వంటి సంస్థలు వస్తున్నాయని వెల్లడి
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు అసూయతో, కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని సంధ్యారాణి ఆరోపించారు. "ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ప్రజల ఆస్తులు లాక్కున్నారు. విశాఖ వాసుల మంచితనాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యంగా దోచుకున్నారు. రుషికొండను బోడికొండగా మార్చడమే కాకుండా, స్టీల్ ప్లాంట్‌ను మూసివేయించారు. వ్యాపారాలను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడటానికి సిగ్గుపడాలి" అని ఆమె మండిపడ్డారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది, చేసేది కూడా తమ ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్‌ను తిరిగి తెరిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌ల కృషితోనే ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ విశాఖకు వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు అర్సెల్లార్ మిట్టల్ వంటి సంస్థలతో పాటు పార్వతీపురంలో గిరిజన విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కడుతున్నాయని వివరించారు.
కూటమి ప్రభుత్వం ఉందన్న ధైర్యంతోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం తన వందేళ్ల పండుగను సగర్వంగా జరుపుకుంటోందని సంధ్యారాణి అన్నారు. వైసీపీ హయాంలో విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ తమ పార్టీ మీటింగులు పెడతారోనని వైస్ ఛాన్సలర్లు సైతం భయంతో గడిపారని ఆమె ఎద్దేవా చేశారు.