వైజాగ్ లో ఐబీఎం.. ఫొటో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్
- విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఐబీఎం
- ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి వైజాగ్‌కు వస్తున్న టెక్ దిగ్గజం
- మొదటగా 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం
- రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా ఐబీఎం ప్రణాళిక
- ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడి
దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఐబీఎం తిరిగి విశాఖకు వస్తోంది. ఇందుకోసం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (STPI)లో ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన కార్యకలాపాల కోసం ఇప్పటికే నమోదు చేసుకుంది. ఈ కేంద్రం ద్వారా తొలుత 500 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి లభించనుంది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 321 కోట్ల విలువైన ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. గత జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్.. ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఆ చర్చల ఫలితంగానే ఇప్పుడు ఐబీఎం విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో మధురవాడ ఐటీ సెజ్‌లో ఐబీఎంకు కార్యాలయం ఉండేది. ఇప్పుడు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా విశాఖను కీలక ఐటీ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత బలం చేకూరింది.