నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల
- ‘రాకాస’ చిత్ర విజయోత్సవ వేడుక
- నిర్మాతగా నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్న నిహారిక
- సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయలకే ‘రాకాస’ సినిమా అని ప్రకటన
ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘రాకాస సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ అది సాధ్యం కాదు. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారంటే, అదే నాకు నిజమైన విజయం అనిపిస్తోంది. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటానని మాటిస్తున్నాను. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ‘ఉప్పెన’ సినిమా సమయం నుంచి మైత్రీ రవి గారితో మంచి పరిచయం ఉంది. ఆయన నాకు ఈ పరిశ్రమలో ఒక గైడ్‌లా మార్గనిర్దేశం చేస్తుంటారు. అలాగే, ఇండస్ట్రీ స్ట్రైక్ సమయంలో అండగా నిలిచిన సుప్రియ అక్క, స్వప్న అక్కలకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తెలిపారు.
సినిమా గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘‘వేసవిలో కుటుంబమంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. నా టీం సపోర్ట్ వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రమోషన్ల విషయంలో సంగీత్, నయన్, గెటప్ శ్రీను ఇలా ఎవరూ ఎలాంటి కండీషన్స్ పెట్టకుండా పూర్తి సహకారం అందించారు. మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌కు రమేష్ గారు పెద్ద పిల్లర్‌గా నిలిచారు. మీడియా కూడా మా సినిమాకు ఎంతో మద్దతు ఇచ్చింది. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు, నేటి నుంచి సింగిల్ స్క్రీన్లలో ‘రాకాస’ టికెట్ ధరను కేవలం 100 రూపాయలకే అందిస్తున్నాం. దయచేసి అందరూ థియేటర్లలోనే సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు.