రికార్డు స్థాయి నుంచి రూ. 31 వేలు పతనమైన బంగారం ధర.. యుద్ధ భయాలున్నా ఎందుకీ పతనం?
- యుద్ధ ఉద్రిక్తతల నడుమ పసిడి ధరల్లో పతనం
- రికార్డు స్థాయి నుంచి 17 శాతం మేర తగ్గిన రేట్లు
- బలపడుతున్న డాలర్, ఫెడ్ వడ్డీరేట్లే ప్రధాన కారణం
- రానున్న రోజుల్లో తీవ్ర ఒడుదొడుకులు తప్పవన్న నిపుణులు
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మొదట్లో బంగారం సురక్షిత పెట్టుబడిగా ఆకర్షణ పొందింది. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఆశలు సన్నగిల్లడంతో సెంటిమెంట్ మారింది. యుద్ధ వాతావరణంతో ముడిచమురు ధరలు పెరగడం అమెరికా డాలర్‌ను బలపరిచింది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. ఇది పసిడి పెరుగుదలకు అడ్డుకట్ట వేసింది.
మరోవైపు, అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం కూడా బంగారంపై ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల వెలువడిన నాన్-ఫామ్ పేరోల్స్ గణాంకాలు మెరుగ్గా ఉండటంతో, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించవచ్చనే అంచనాలు బలపడ్డాయి. అధిక వడ్డీరేట్లు రాబడి లేని బంగారం వంటి ఆస్తుల ఆకర్షణను తగ్గిస్తాయి.
టెక్నికల్‌గా బంగారం ధరకు రూ.1,48,000 వద్ద మద్దతు, రూ.1,55,000 వద్ద నిరోధం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతవారంలో పసిడి సుమారు 2.20 శాతం లాభపడినప్పటికీ, రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలకు అనుగుణంగా ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.