ఇండిగో ఎయిర్ లైన్స్‌కు నూతన సీఈవో
- ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్
- ప్రస్తుతం ఐఏటీఏ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న వాల్ష్
- ఆగస్టు 3 నాటికి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం
- పీటర్ ఎల్బర్స్ రాజీనామా నేపథ్యంలో ఈ నియామకం
ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న విలియం వాల్ష్, జులై 31న ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. అనంతరం, ఆగస్టు 3 నాటికి ఆయన ఇండిగో సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే, ఈ నియామకానికి భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతులు లభించాల్సి ఉంది.
గతంలో వాల్ష్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ (ఐఏజీ), బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ లింగస్ వంటి ప్రఖ్యాత సంస్థలకు సీఈవోగా పనిచేసి, వాటిని విజయవంతంగా నడిపించిన అపార అనుభవం ఉంది.
విలియం వాల్ష్ నియామకం పట్ల ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా, ఎండీ రాహుల్ భాటియా హర్షం వ్యక్తం చేశారు. వాల్ష్ అనుభవం, నాయకత్వ పటిమ ఇండిగోను తదుపరి వృద్ధి దశకు తీసుకువెళ్తాయని వారు విశ్వాసం ప్రకటించారు. ఇండిగోకు నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని విలియం వాల్ష్ తెలిపారు.