పశ్చిమాసియా సెగ: నెల రోజుల్లో రూ.51 లక్షల కోట్లు ఆవిరి
- పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో మార్కెట్ల పతనం
- నెల రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.51 లక్షల కోట్లు ఫట్
- వరుసగా ఐదో వారం నష్టాల్లో ముగిసిన సూచీలు
- నష్టాలతోనే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం
ముడి చమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఫలితంగా సూచీలు వరుసగా ఐదో వారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. 2025 ఆగస్టు తర్వాత మార్కెట్లు ఇంత సుదీర్ఘకాలం నష్టపోవడం ఇదే తొలిసారి.
2025-26 ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సోమవారం (మార్చి 30) కూడా మార్కెట్లలో అమ్మకాల హోరు కొనసాగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,635 పాయింట్లు పతనమై 71,947 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 22,331 వద్ద ముగిసింది. ఒక్క సోమవారమే ఇన్వెస్టర్లు రూ.9.74 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో నష్టం రూ.18.60 లక్షల కోట్లుగా నమోదైంది.
మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది కాలంలో సెన్సెక్స్ 7 శాతం, నిఫ్టీ దాదాపు 5 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 412.41 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదిలా ఉండగా, మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం (మార్చి 31) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు. తిరిగి బుధవారం నుంచి యథావిధిగా ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయి.