కామెంటేటర్‌గా రాజీనామా చేస్తున్నా: బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ పోస్టు
- రెండు దశాబ్దాలుగా తనను బీసీసీఐ విస్మరిస్తోందని ఆరోపణ
- తన పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందని ఆవేదన
- తన తర్వాత వచ్చిన వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించారని పోస్టు
- 'ఎక్స్' వేదికగా పోస్టులు పెట్టిన లక్ష్మణ్ శివరామకృష్ణన్
బీసీసీఐ కామెంటేటర్ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు శివరామకృష్ణన్ తాజాగా సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించాడు. 23 ఏళ్లుగా బీసీసీఐ తనను నిర్లక్ష్యం చేస్తోందని వాపోయాడు. తన పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందని ఆరోపించాడు. ఇన్నేళ్లుగా బీసీసీఐతోనే ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కీలక బాధ్యతలు అప్పగించలేదని వాపోయాడు. తనను ఎప్పుడూ పెద్ద మ్యాచ్ లకు టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్ వంటి వాటికి ఉపయోగించుకోలేదని అన్నాడు.
తన తర్వాత వచ్చిన ఎందరికో ఇలాంటి అవకాశాలు వచ్చాయని తెలిపాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ కొత్త వాళ్లతోనే పిచ్ రిపోర్టు ప్రజెంటేషన్ చేయించిందని వాపోయాడు. ముఖ్యమైన అంశాల్లో తనను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పనిచేయనని పేర్కొన్నాడు. సాధారణ ప్రజలు, క్రికెట్ అభిమానులు తన నిర్ణయంతో షాక్ అవుతారని తెలుసని అన్నాడు.
నన్ను ద్వేషించేవారు సంతోషిస్తారని, వారి సంతోషం పట్ల తాను ఆనందంగా ఉంటానని అన్నాడు. తనను మంచివాడిగా భావించినవారు ఉంటారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. లక్ష్మణ్ శివరామకృష్ణన్ పోస్టుపై రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, 'వద్దు' అని సూచించాడు.