స్వదేశంలో ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత.. తాజా సర్వే వెల్లడి
- ఏడాది తిరిగేసరికే పాతాళానికి పడిపోయిన ప్రజాదరణ
- వలస వ్యతిరేక విధానాలపై ప్రజల్లో ఆగ్రహం
- ప్రతీకార సుంకాలపై స్వదేశంలోనూ తీవ్ర విమర్శలు
సర్వేలోని ముఖ్యాంశాలు..
కేవలం 12 శాతం మంది మాత్రమే ట్రంప్‌ను ‘అద్భుతమైన అధ్యక్షుడు’ గా భావిస్తుండగా.. 53% మంది ఆయనను ‘విఫల అధ్యక్షుడు’ గా ముద్ర వేశారు. ట్రంప్ ఆమోదం రేటింగ్ 39 శాతానికి పడిపోగా.. వ్యతిరేకత 58 శాతానికి పెరిగింది. ముఖ్యంగా వలస వ్యతిరేక విధానాలు, హెచ్-1బీ వీసా నిబంధనల కఠినత, మరియు వాణిజ్య యుద్ధం వంటి నిర్ణయాలపై అమెరికన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వరుస వివాదాలు..
గతేడాది ‘లిబరేషన్ డే’ పేరుతో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వికటించాయి. స్వదేశంలోనూ దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ప్రతిపక్ష డెమొక్రాట్ల నియంత్రణలో ఉన్న నగరాల్లో ‘నేషనల్ గార్డ్’ ను మోహరించడం వంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను మరింత పెంచాయి.
మధ్యంతర ఎన్నికలపై ప్రభావం..
ప్రజాదరణ పడిపోతుండటంతో 2026లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సెనేట్ డెమొక్రాట్ల వశమైతే తనపై అభిశంసన వేటు పడే అవకాశం ఉందని ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను హెచ్చరించడం అక్కడి రాజకీయ వేడిని సూచిస్తోంది.
ట్రంప్ యంత్రాంగం దిద్దుబాటు చర్యలు..
ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని గమనించిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు వ్యూహాలు మారుస్తోంది. మిన్నెసోటాలో వలసదారులపై అణిచివేతను ఆపడం, ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను తగ్గించడం వంటి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఈ చర్యలు ఓటర్ల మనసు మార్చలేవని తాజా పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.