వలీ వ్యవహారంపై నాగబాబు స్పందన... రూ.25 వేల ఆర్థికసాయం
- చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని నాగబాబు హామీ
- మేడారంలో కోవా బన్ వ్యాపారిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన నాగబాబు
- ఈ ఘటనను మతపరమైన కోణంలో చూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి
- మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా దాడిని ఖండించారని వెల్లడి
ఈ దాడి ఘటన తర్వాత ఎందరో చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారని నాగబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. దాడి కారణంగా శివరాత్రి నాడు తాను వ్యాపారం చేసుకోలేకపోయానని బాధిత వ్యక్తి వలీ ఆవేదన వ్యక్తం చేయగా, అతనికి వ్యక్తిగతంగా రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించినట్లు నాగబాబు తెలిపారు. వలీ వంటి ఎందరో చిరువ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ దాడిని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఖండించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ ఘటనకు మతపరమైన రంగు పులమవద్దని నాగబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతపై ఏమైనా సందేహాలుంటే, దానిని పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయని, సంబంధిత అధికారులను సంప్రదించాలి తప్ప దాడులకు పాల్పడటం సరికాదని సూచించారు.
దేశంలో కోట్ల మంది తక్కువ మూలధనంతో తమ కాళ్లపై తాము నిలబడాలనే సంకల్పంతో వ్యాపారాలు చేస్తున్నారని గుర్తుచేశారు. పట్టణ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు వీరు విక్రయించే ఆహారంపైనే ఆధారపడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని, అలాంటి వారిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని నాగబాబు వివరించారు.