ఉప్పల్లో కబ్జాదారులకు హైడ్రా షాక్.. రూ.85 కోట్ల పార్కు స్థలాలు స్వాధీనం
- బాబానగర్, నాచారంలలో మొత్తం 7వేల గజాల భూమికి రక్షణ
- ప్రజావాణిలో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు
- కబ్జాకు గురైన స్థలాల చుట్టూ ఫెన్సింగ్, బోర్డులు ఏర్పాటు
- అక్రమ లేఅవుట్ను గుర్తించి చర్యలు తీసుకున్న యంత్రాంగం
1980లో వేసిన బాబానగర్ కాలనీ లేఅవుట్లో 3వేల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే కాలక్రమేణా ఈ స్థలాన్ని కొందరు అక్రమంగా 500 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి విక్రయించారు. దీనిపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అసలు లేఅవుట్ పత్రాలను ధ్రువీకరించుకున్నారు. ఇప్పటికే కొంత భాగంలో నిర్మాణాలు జరగడంతో, మిగిలిన 2వేల గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. ఇది పార్కు స్థలమని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
ఇదే తరహాలో, ఉప్పల్ మండలం నాచారంలోని కార్తికేయ నగర్లో కూడా పార్కు కోసం కేటాయించిన 5వేల గజాల స్థలాన్ని అధికారులు కాపాడారు. ఈ రెండు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న భూముల మొత్తం విలువ రూ.85 కోట్లుగా అంచనా వేశారు. ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.