దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న ఓలా, ఉబర్ సేవలు: నేడు ‘ఆల్ ఇండియా బ్రేక్ డౌన్’!
- నేడు 6 గంటల పాటు డ్రైవర్ల సమ్మె
- కనీస ఛార్జీల నిర్ణయంపై సర్కారుకు అల్టిమేటం
- దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం
ముఖ్యంగా అగ్రిగేటర్ సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలను నిర్ణయిస్తూ డ్రైవర్లను శ్రమదోపిడీకి గురిచేస్తున్నాయని యూనియన్ ఆరోపిస్తోంది. 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025' అమల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కనీస ఛార్జీలను నోటిఫై చేయకపోవడం వల్ల డ్రైవర్ల ఆదాయం దారుణంగా పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రైవేట్ నంబర్ ప్లేట్ వాహనాలను కమర్షియల్ అవసరాలకు వాడటం వల్ల లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని, దీనిపై తక్షణమే నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన 'ఎకనామిక్ సర్వే 2025-26' సైతం గిగ్ వర్కర్ల దయనీయ స్థితిని ఎత్తిచూపింది. దేశంలో సుమారు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ. 15,000 కంటే తక్కువ ఆదాయంతో సరిపెట్టుకుంటున్నట్లు సర్వే పేర్కొంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'భారత్ టాక్సీ' అనే సహకార ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడం ఈ రంగంలో కొత్త చర్చకు దారితీసింది.