చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి
- చంద్రబాబు, మోదీ కనుసన్నల్లో రేవంత్ పాలన కొనసాగుతోందన్న జగదీశ్ రెడ్డి
- తెలంగాణలో దోపిడీ రాజ్యమేలుతోందని ఆరోపణ
- రాష్ట్ర నదీ జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని మండిపాటు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక దొంగలు పడ్డారని, ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ దోపిడీలో భాగస్వాములేనని ఆయన విమర్శించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, అక్కడ తడిసి మొలకెత్తిన వడ్లను పరిశీలించారు. అరవై రోజులు గడిచినా ప్రభుత్వం వడ్లు కొనకపోవడం దారుణమని, రైతుల కష్టాలు పాలకులకు పట్టడం లేదని ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, "దుక్కి దున్నాల్సిన సమయంలో రైతులు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొంది. కాంటాలైన ధాన్యాన్ని కూడా మిల్లుల్లో బేరాలాడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లారీల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలతో పాటు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని, తక్షణమే ఐకేపీ కేంద్రాల్లోని ప్రతీ గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.