ఏపీ లిక్కర్ స్కామ్... నిందితులందరికీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు
- ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు
- జూన్ 3 వరకు నిందితులకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌కు కోర్టు ఆదేశం
ఈ కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఈ ఉదయం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా, కేసు దర్యాప్తు పురోగతిని తమకు తెలియజేయడం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని సమగ్రంగా వివరిస్తూ లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో, తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, మానవతా దృక్పథంతో అరగంట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు.