బాలీవుడ్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
- తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాలిటిక్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన ప్రకాశ్ రాజ్
- బాలీవుడ్‌లోని తోటి నటీనటులు ఈ అంశంపై స్పందించకపోవడాన్ని తప్పుబట్టిన నటుడు
- హిందీ ఇండస్ట్రీలో చాలామంది ప్రభుత్వానికి అమ్ముడుపోయారని వ్యాఖ్య
- అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరని సంచలన వ్యాఖ్యలు
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ... "ప్రభుత్వం ఏదైనా సరే... చర్చలను అణచివేస్తుంది. మరో విషయం ఏంటంటే.. ఒక విషయంపై మాట్లాడాలా వద్దా అనేది నటీనటులపైనే ఆధారపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే నటీనటులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరంటే... సినీ పరిశ్రమలోని సగం మంది అమ్ముడుపోయారు. మరికొంతమందికి మాట్లాడే ధైర్యం లేదు.
నా మిత్రుడు ఒకరు ఇదే విషయాన్ని చెప్పాడు. 'ప్రకాశ్ నీకు ధైర్యం ఉంది. నువ్వు మాట్లాడగలుగుతున్నావు. కానీ, నాకు అంత ధైర్యం లేదు' అన్నాడు. నేను అతని పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ, ఒక్క విషయం మాత్రం నిజం. నేరాలు చేసిన వారినైనా చరిత్ర వదిలేస్తుందేమో. కానీ, మౌనంగా కూర్చున్నవారిని మాత్రం విడిచిపెట్టదు. ప్రతిఒక్కరూ బాధ్యత వహించాల్సిందే" అని అన్నారు.
అలాగే బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడంపై స్పందిస్తూ... తాను ఏదైనా సూటిగా మాట్లాడతానని, రాజకీయ విషయాలపై ఎప్పటికప్పుడు నా అభిప్రాయాలను చెబుతుంటానని అన్నారు. ఒకవేళ తనతో వర్క్ చేస్తే భవిష్యత్తులో తమకు సమస్యలు వస్తాయని భావించి ఉండొచ్చన్నారు. అందుకే తనకు అక్కడ అవకాశాలు తగ్గాయని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు.