జగదీశ్ రెడ్డికి ఇంకా అహంకారం తగ్గలేదు: కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి
- అసెంబ్లీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారనడం విడ్డూరమన్న కాంగ్రెస్ నేత
- దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్
- స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని వ్యాఖ్య
గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా చేసి వస్తే, ఎవరు చేసింది సరైనదో ప్రజలే తేల్చుతారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్పీకర్ పట్ల మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్థించరని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
గతంలో రబ్బర్ చెప్పులు, డొక్కు స్కూటర్ మీద తిరిగిన జగదీశ్ రెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఓ నియంతలా వ్యవహరించి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ 12 సీట్లకు 11 సీట్లలో ఓడిపోయిందని అన్నారు. జగదీశ్ రెడ్డి ఒక్కరే గెలిచారని గుర్తు చేశారు. ఇంకా అధికారంలో ఉన్నామనే అహంభావంతో ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి ప్రవర్తించిన తీరుకు ఆయనను పూర్తి కాలం సభ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు.