'హైడ్రా'కు హిట్లరే స్ఫూర్తి.. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
- హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్
- బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు
- రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీవ్ర ఆగ్రహం
- ఇది కాంగ్రెస్ హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వానికి నిదర్శనమన్న బీజేపీ
- చారిత్రకంగా రేవంత్ వాదనలో నిజం లేదంటున్న నిపుణులు
చెరువులు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై హైడ్రా ఏజెన్సీ తీసుకుంటున్న కఠిన చర్యలను సమర్థించుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. "హైడ్రా అనే పదం హిట్లర్‌కు చాలా ఇష్టమైనది. ఆయన కోర్ టీమ్‌ను హైడ్రా అని పిలిచేవారు, వారు ఎవరినైనా హతమార్చగలరు. అందుకే నేను హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది దీనికి హైడ్రా అని పేరు పెట్టాను" అని ఆయన వివరించారు.
అయితే, రేవంత్ రెడ్డి వాదనలో చారిత్రక నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌కు 'హైడ్రా' పేరుతో ఎలాంటి హంతక బృందం లేదని, వాస్తవానికి నాజీ జర్మనీపై బ్రిటన్ వైమానిక దళం జరిపిన బాంబు దాడి ఆపరేషన్‌కు ఆ పేరుందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది కాంగ్రెస్ పార్టీ 'హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వానికి' నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. దీన్ని 'తానాషాహి' (నియంతృత్వం) అని అభివర్ణించారు. గతంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ, ఇది కాంగ్రెస్ నైజమని విమర్శించారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రేవంత్ వ్యాఖ్యలను ఖండించింది. సోషల్ మీడియాలో సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.