అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించాం: సీపీ
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీపీ ప్రెస్ మీట్
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ వెళుతున్న వీడియో విడుదల
- ఇది చూసిన తర్వాతైనా మీకు అర్థం కావడం లేదా అంటూ సీపీ వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. తొక్కిసలాట వేళ... థియేటర్ లో ఉన్న అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు.
ఆ రోజున విధుల్లో ఉన్న పోలీసు అధికారులతోనూ సీపీ తన ప్రెస్ మీట్లో మాట్లాడించారు. అక్కడున్న రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నందున అల్లు అర్జున్ ను రావొద్దని చెప్పామని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తాను కూడా చనిపోతానేమో అనుకున్నానని వెల్లడించారు.
తొక్కిసలాట విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ కు తెలియజేశామని... ఓ మహిళ చనిపోయింది, బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పామని వివరించారు. కానీ, అల్లు అర్జున్ వద్దకు మేం వెళ్లేందుకు ఆ మేనజర్ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అక్కడ్నించి వెళ్లిపోకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పామని, అయినప్పటికీ వినిపించుకోలేదని, సినిమా మొత్తం చూసి వెళ్లడానికే అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని ఆరోపించారు. దాంతో, డీసీపీ వెళ్లి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.