తదుపరి మహమ్మారి 5 కోట్ల మందిని బలి తీసుకుంటుంది: నిపుణుల అంచనా
- డిసీజ్ ఎక్స్ వచ్చే క్రమంలో ఉందన్న ప్రచంచ ఆరోగ్య సంస్థ
- దీని కారణంగా ఐదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రిటన్ నిపుణుడి అంచనా
- చుట్టూ ఉన్న వైరస్ లే ప్రాణాంతకంగా పరిణమించొచ్చని విశ్లేషణ
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక గణాంకాల ప్రకారం కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, అనధికారికంగా దీనికి మరో రెండు రెట్లు ఎక్కువే ప్రాణ నష్టం జరిగి ఉంటుందని (సుమారు 2 కోట్ల వరకు) కొందరి అభిప్రాయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే తదుపరి మహమ్మారి ‘డిసీజ్ ఎక్స్’ ఇప్పటికే వచ్చే క్రమంలోనే ఉందని పేర్కొంది. కరోనా కంటే ఏడు రెట్లు అధికంగా డిసీజ్ ఎక్స్ తో ప్రాణాలు కోల్పోతారని కేట్ బింగమ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వైరస్ నుంచే తదుపరి ప్రాణాంతక మహమ్మారి ఉద్భవించొచ్చన్నారు.
1918-19లో వచ్చిన ఫ్లూ వల్ల 5 కోట్ల మంది మరణించగా, తదుపరి మహమ్మారి కూడా ఇదే తీవ్రతతో ఉంటుందని కేట్ బింగమ్ పేర్కొన్నారు. డిసీజ్ ఎక్స్ మీజిల్స్, ఎబోలా తదితర వైరస్ స్థాయిలో వ్యాప్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వైరస్ లతోనే ఈ స్థాయి ప్రాణ నష్టం సంభవించొచ్చన్నారు. అన్ని వైరస్ లు మానవాళికి ముప్పు కలిగించకపోయినా, కొన్ని ప్రాణాంతకంగా మారతాయన్నారు. సైంటిస్టులు సుమారు 25 వైరస్ కుటుంబాలను పరిశీలిస్తున్నారని.. ప్రతి కుటుంబంలో వేలాది విడి వైరస్ లు ఉన్నట్టు ఆమె చెప్పారు. కొన్ని వైరస్ లు ప్రమాదకరంగా మ్యుటేషన్ చెందొచ్చన్నారు.