మజ్లిస్ ను చంకలో పెట్టుకున్న కేసీఆర్ మరోపక్క 'మతోన్మాదం' అంటుంటే బాధేస్తోంది!: బీజేపీ నేత లక్ష్మణ్
- కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు
- ఈ నెల 18న 20 వేల మంది బీజేపీలో చేరుతారు
- కాంగ్రెస్, టీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించిన లక్ష్మణ్
మజ్లిస్ పార్టీని చంకలో పెట్టుకున్న సీఎం కేసీఆర్, మరోపక్క మతోన్మాదం అంటూ మాట్లాడితే బాధేస్తోందని లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. కేసీఆర్ చెబుతున్న శ్రీరంగనీతులు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపడుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో వారసత్వ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు తామంతా సైనికుల్లా పనిచేస్తున్నామని తెలిపారు. తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని లక్ష్మణ్ వెల్లడించారు. టీఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటైనా బీజేపీ చేతిలో ఓడిపోక తప్పదని వ్యాఖ్యానించారు.