తండ్రి వయసున్న చంద్రబాబుపై కొడాలి నాని మాట్లాడే పద్ధతిని ప్రజలు గమనిస్తున్నారు: దేవినేని అవినాశ్
- ఏడాదికోసారి వచ్చేవాడు లోకలా?
- చచ్చేవరకు గుడివాడలోనే ఉంటా!
- గుడివాడలో ఇప్పటికీ ఎన్టీఆర్ హవా ఉంది
తాను పుట్టింది కృష్ణా జిల్లాలోనే అని, చంద్రబాబు ఆదేశాలతో గుడివాడ నుంచి పోటీచేస్తున్నానని వివరించారు. వ్యాపారాల కోసం నియోజకవర్గ ప్రజలను కూడా వదిలేసి హైదరాబాద్ వెళ్లి, ఎప్పుడో ఏడాదికోసారి వచ్చే వ్యక్తి లోకల్ ఎలా అవుతాడంటూ నానిపై విమర్శలు చేశారు. చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో గుడివాడలోనే ఇల్లు కొనుక్కున్నానని, చనిపోయేవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు తన దృష్టంతా గెలుపుపైనే ఉందని స్పష్టం చేశారు.
తండ్రి వయసున్న చంద్రబాబులాంటి వ్యక్తిపై కొడాలి నాని మాట్లాడే పద్ధతిని అందరూ గమనిస్తున్నారని అవినాశ్ తెలిపారు. నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీ నుంచి సస్పెండైన నాని ప్రజల సమస్యలను ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో నాని గెలిచింది కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇప్పటికీ గుడివాడలో ఎన్టీరామారావు హవా ఉందని అన్నారు.