బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం: హరీశ్ రావు
- ఫార్మా సిటీని మళ్లీ పునరుద్ధరిస్తామని వెల్లడి
- అమెరికా పర్యటనలో వ్యాఖ్యలు
- 16 వేల ఎకరాల భూసేకరణ పూర్తైందని వెల్లడి
- కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులూ వచ్చాయన్న మాజీ మంత్రి
- వేరే అవసరాలకు వాడితే భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
భూములను రైతులకు ఇచ్చేయాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఫార్మా సిటీ’ని మళ్లీ పునరుద్ధరిస్తామని హరీశ్ తెలిపారు. ఫార్మా సిటీ కోసం తాము 16 వేల ఎకరాల భూసేకరణ చేశామన్నారు. దానికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అన్ని క్లియరెన్సులు కూడా వచ్చాయని వెల్లడించారు. ఏ ఉద్దేశంతోనైతే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నామో దానికి భిన్నంగా భూమిని వేరే అవసరాల కోసం వాడితే ఆ ల్యాండ్‌ను తిరిగి రైతులకే ఇచ్చేయాలని చట్టం చెబుతోందని తెలిపారు. ఫార్మా సిటీని రద్దు చేసి వేరే ప్రాజెక్ట్ పెడితే చట్ట ప్రకారం ఆ భూములను రైతులకు వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శించారు.
కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు
ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని రేవంత్ సర్కార్ హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా అబద్ధాలు చెప్పిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఓవైపు కోర్టుకు ఫార్మా సిటీ కొనసాగిస్తామని చెబుతూనే మరోవైపు ఫ్యూచర్ సిటీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. ఫార్మా సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని చట్ట ప్రకారం దాన్నే కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.