పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్
- పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వైరల్.. తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు, జనసైనికులు
- కమెడియన్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత సందీప్ పంచకర్ల
- బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
- వ్యక్తిత్వ హననం కళ కాదు, నేరమంటూ జనసేన నేత ఆగ్రహం
స్టాండప్ కామెడీ ప్రదర్శనలో భాగంగా అనుదీప్.. పవన్ కల్యాణ్ వివాహాలు, విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. అంతేగాక ఆయన కుటుంబసభ్యుల పేర్లను కూడా ఉటంకిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్యం పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం, వారిని కించపరిచేలా మాట్లాడటం భావప్రకటనా స్వేచ్ఛ కిందికి రాదని పలువురు హితవు పలుకుతున్నారు.
ఈ వివాదంపై జనసేన నాయకుడు సందీప్ పంచకర్ల తీవ్రంగా స్పందించారు. అనుదీప్‌కు ఇది చివరి హెచ్చరిక అని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరచడం, దూషించడం స్టాండప్ కామెడీ కాదని ఆయన అన్నారు. "ఏపీ డిప్యూటీ సీఎంను లక్ష్యంగా చేసుకుని, ఆయన కుటుంబసభ్యులైన మహిళల పేర్లను వివాదంలోకి లాగడం అత్యంత నీచమైన చర్య. ఇది మర్యాద, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధులను దాటింది" అని సందీప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
నిర్మాణాత్మక విమర్శలకు తాము వ్యతిరేకం కాదని, కానీ మహిళలను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిత్వ హననం అనేది కళ కాదని, అదొక నేరమని సందీప్ పంచకర్ల ఘాటుగా వ్యాఖ్యానించారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం, జనసేన నేతలు వాటిని తిప్పికొట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే, ఒక స్టాండప్ కామెడీ షోలో ఇలాంటి వ్యాఖ్యలు రావడంపై జనసైనికులు మరింత ఆగ్రహంతో ఉన్నారు.