పవన్ ఖేరా అరెస్ట్‌పై ఉత్కంఠ... తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
- అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసులో పవన్ ఖేరాకు అరెస్ట్ ముప్పు
- అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్
- ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పు రిజర్వ్
- రేపు వెలువడనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- ఇది రాజకీయ కక్ష సాధింపేనని ఖేరా తరఫు న్యాయవాది వాదన
అసోం పోలీసులు నమోదు చేసిన కేసు నేపథ్యంలో, అక్కడి కోర్టులను ఆశ్రయించేందుకు వీలుగా తనకు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలని ఖేరా తన పిటిషన్లో కోరారు. ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, అసోం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆరోపించారు. అయితే, అసోం అడ్వకేట్ జనరల్ దేవాజిత్ సైకియా ఈ వాదనలను వ్యతిరేకించారు. ఢిల్లీ నివాసి అయిన ఖేరా, హైదరాబాద్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో సరైన కారణాలు చూపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రినికి భూయాన్ శర్మకు పలు విదేశీ పాస్‌పోర్టులు, విదేశాల్లో ప్రకటించని ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా ఇటీవల ఓ ప్రెస్మీట్లో సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అసోం పోలీసులు ఆయనపై పరువునష్టం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని ఖేరా నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. మరోవైపు, హైదరాబాద్‌లోని ఆయన భార్య నీలిమ ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, అజ్ఞాతం నుంచి పవన్ ఖేరా ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఆయనపై, ఆయన భార్యపై వచ్చిన ఆరోపణలకు సీఎం సమాధానం చెప్పాలే తప్ప, పోలీసులను అడ్డుపెట్టుకోవడం సరికాదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడనని, రాహుల్ గాంధీ సైనికుడిగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని స్పష్టం చేశారు.