అదంతా బీజేపీ ప్లాన్.. అధికారుల నిర్బంధం అంశంపై మమత
- మాల్దాలో అధికారుల ఘెరావ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- అధికారులను అడ్డుకున్నది ఎవరో తమకు తెలియదన్న సీఎం
- తప్పుడు ఫిర్యాదులతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ ఆరోపణ
సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘‘అక్కడ అధికారులను ఎవరు అడ్డుకున్నారో మాకు తెలియదు. ఇదంతా బీజేపీ సృష్టించిన గేమ్ ప్లాన్. తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆమె ఆరోపించారు. ఎన్నికల వేళ ఉద్రిక్తతలు సృష్టించేందుకు కేంద్ర బలగాలతో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని, మాల్దా ఘటన అందులో భాగమేనని ఆమె విమర్శించారు.
మాల్దాలో ఎన్నికల అక్రమాలపై సమీక్షించేందుకు వెళ్లిన అధికారుల బృందాన్ని స్థానికులు గుంపుగా చుట్టుముట్టి, వారి వాహనాలను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది. ప్రస్తుతం బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో ఈ ఘటన రాజకీయంగా మరింత వేడి పుట్టించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.