నరసాపురం-చెన్నై వందేభారత్ రైలును ప్రారంభించిన కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ
- నరసాపురం-చెన్నై వందేభారత్ రైలుకు పచ్చజెండా
- కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ చేతుల మీదుగా ప్రారంభం
- తొమ్మిది గంటల్లో 655 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయనున్న రైలు
- డిసెంబర్ 17 నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటు
ఇప్పటివరకు చెన్నై సెంట్రల్-విజయవాడ మధ్య నడుస్తున్న ఈ సెమీ-హైస్పీడ్ రైలును గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ రైలు, డిసెంబర్ 17 నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది.
ఈ రైలు నరసాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి, రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నైలో ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపురం వస్తుంది. మొత్తం 655 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 9 గంటల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలు భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్లలో ఆగుతుంది.
ఈ రైలులో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1,635 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,030గా అధికారులు నిర్ణయించారు. ఈ కొత్త సర్వీసుతో వాణిజ్య, వ్యాపార, పర్యాటక ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.