వ్యక్తిగత దూషణలు తగదు.. ప్రసన్నకుమార్‌రెడ్డిపై పవన్ ఆగ్రహం
- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలు
- తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్య
- వైసీపీ నేతలకు మహిళలను కించపరచడం అలవాటైపోయిందని విమర్శ
- ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ పిలుపు
ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "మహిళలపై అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి" అని ఆయన పేర్కొన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు.
గతంలో శాసనసభలోనూ వైసీపీ నేతలు ఇలాగే ప్రవర్తించారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్పారని పవన్ గుర్తుచేశారు. మహిళలను కించపరిచే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాజకీయాలను రాష్ట్రంలోని మహిళా సమాజం మరోసారి తిప్పికొడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.