ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో కూల్చేయాలన్న మహారాష్ట్ర బీజేపీ ఎంపీ
- సమాధి తొలగించాలన్న డిమాండ్ కు మహారాష్ట్ర సీఎం మద్దతు
- అయితే, సమాధి తొలగింపు చట్టప్రకారమే జరగాలన్న ఫడ్నవీస్
- ఆ స్థలాన్ని ఏఎస్ఐకి అప్పగించిందంటూ కాంగ్రెస్ పై ఫైర్
సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై బీజేపీ సతారా ఎంపీ, ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజె భోసాలె స్పందించారు. ఓ దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించడానికి చట్టాలతో పనేముందని, సింపుల్ గా ఓ జేసీబీని పంపించి ఔరంగజేబ్ సమాధిని నేలమట్టం చేయాలని కోరారు. ఔరంగజేబ్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాలని భావించే వారు ఈ శకలాలను తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో పెట్టుకోవచ్చని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకానీ మరాఠా గడ్డపై ఔరంగజేబ్ ను కీర్తిస్తే ఇకపై సహించబోమని తేల్చిచెప్పారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబ్ ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఉదయన్ రాజె భోసాలె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ, రాజమాత జిజావు ఛత్రపతి, శంభాజీ మహరాజ్ లను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.